All meadia

 

Tuesday, 25 August 2015

కిలో సబ్సిడీ ఉల్లి కోసం 3 వేల మంది క్యూ

ఒకచోట ఉల్లిపాయల దొంగతనం.. ఇంకోచోట కేజీ సబ్సిడీ ఉల్లి కోసం 3 వేల మంది క్యూ.. మరోచోట మహిళల తోపులాట.. రిటైల్‌ మార్కెట్‌లో ఉల్లి ధర కిలో రూ.60-80 దాకా పలుకుతున్న నేపథ్యంలో ఊరూరా కనిపిస్తున్న ఉల్లి లొల్లి ఇది. ధరాభారం తట్టుకోలేని సామాన్యులకు ఉల్లిని అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో ఏపీ సర్కారు కేజీ రూ.20కే ఉల్లి విక్రయ కేంద్రాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పాలకొల్లు పట్టణం మొత్తానికీ ఏఎంసీ ప్రాంగణంలో ఒకే ఒక్క విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు. దీనికి రెండు నుంచి మూడు వేల మంది దాకా రావడంతో పెద్ద క్యూ ఏర్పడింది. కుటుంబంలోని ఎంతమంది ఉంటే అంతమందీ ఆధార్‌ కార్డులు పట్టుకువస్తేనే ఉల్లి ఇస్తామని ఆంక్షలు విఽధించడంతో మహిళలు చంటిబిడ్డలను సైతం భుజాన వేసుకుని మండుటెండలో బారులుతీరారు. దీంతో తొక్కిసలాట జరిగింది. పోలీసులు రంగ ప్రవేశంచేసి వారిని అదుపుచేశారు. మరోవైపు.. విశాఖలోనూ ఇలాంటి దృశ్యాలే ఆవిష్కృతమయ్యాయి. కేజీ సబ్సిడీ ఉల్లి కోసం ఉదయం 5 గంటల నుంచే పెద్ద సంఖ్యలో ప్రజలు బారులు తీరారు. అయితే.. క్యూలో ఉన్నవారికి కాకుండా బయటివారికి ఉల్లిపాయలు ఇస్తున్నట్టు ప్రచారం జరగడంతో అంతా ఒకేసారి కౌంటర్‌వైపు దూసుకెళ్లారు. దీంతో తోపులాట, తొక్కిసలాట జరిగి కొందరు మహిళలు కింద పడిపోయారు. వారిలో కొందరికి స్పృహ తప్పింది. కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ఆర్‌డీఓ, డీఎస్‌ఓ తదితరులు సందర్శించి క్యూ పద్ధతిలో వచ్చినవారికే ఉల్లి పంపిణీ జరిగేలా చర్యలు చేపట్టారు. మరోవైపు.. మహారాష్ట్రలో వరుసగా రెండోరోజూ ఉల్లి చోరీ జరిగింది. ఆదివారం ముంబైలో దొంగలు 7 క్వింటాళ్ల ఉల్లిని చోరీ చేసిన సంగతి తెలిసిందే. అదే రోజు రాత్రి నాసిక్‌లోని నందగావ్‌ తాలూకా పింపడ్‌ఖేడ్‌ గ్రామంలో ఒక గోదాములో నిల్వ ఉంచిన 2000 కిలోల (20 క్వింటాళ్లు) ఉల్లిని దొంగలు ఎత్తుకుపోయినట్టు అబాసాహెబ్‌ పవార్‌ అనే రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చోరీకి గురైన విలువ బహిరంగ మార్కెట్లో రూ.1.60 లక్షల దాకా ఉంటుందని అంచనా.

No comments:

Post a Comment