Regime Disputes on 365 days of CM KCR's rule
హైదరాబాద్ : కేసీఆర్ ఏడాది పాలనలో లేచిన దుమారాలు కూడా అనేకమున్నాయి. ముందు వెనక ఆలోచించకుండా... ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం ఆ తర్వాత వెనక్కి తగ్గడం కేసీఆర్ కు పరిపాటైపోయింది. ఫాస్ట్ పథకం నుంచి... ప్రజా ప్రతినిధుల క్లాసుల వరకు... ఆయన చేసిన ఎన్నో ప్రకటనలు వివాదాలను రేకెత్తించాయి.
హడావుడి నిర్ణయాలపై హైకోర్టు చివాట్లు
సమగ్ర అధ్యయనం చేయకుండా హడావిడిగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల హైకోర్టు కూడా చివాట్లు పెట్టింది. పక్కా తెలంగాణ విద్యార్ధులకే ఫీజులు చెల్లించేందుకు 1956ను ప్రామాణికం చేసింది తెలంగాణ ప్రభుత్వం. విద్యార్ధులే కాదు, వారీ పూర్వీకులు కూడా తెలంగాణకు చెందిన వారైతేనే ఫీజులు చెల్లిస్తానని షరతులు విధించింది. దీంతో సర్కార్ నిర్ణయం పట్ల సర్వత్రా విమర్శలు రావడంతో వెనక్కు తగ్గి పాత విధానాన్నే కొనసాగిస్తుంది.
పార్లమెంటరీ సెక్రటరీల నియామకంపై విమర్శలు
మంత్రులకు తోడుగా తీసుకొచ్చిన పార్లమెంటరీ సెక్రటరీల నియామకం కూడా విమర్శలను ఎదుర్కోంది. పార్లమెంటరీ సెక్రటరీల నియామకం చెల్లదని కోర్టు చెప్పడంతో ప్రభుత్వం నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్లయ్యింది. అయినా వారిని తొలగించకుండా అనధికారికంగా సెక్రటరీలను కొనసాగిస్తోంది.
సచివాలయ మార్పుపై ప్రతిపక్షాల ఆగ్రహం
సచివాలయ మార్పు అంశం ప్రభుత్వ అస్పష్టతకు పరాకాష్టగా నిలిచింది. వాస్తు దోషం ఉందన్న కారణంతో... ప్రస్తుత సచివాలయాన్ని మరో చోటికి మార్చాలని సంకల్పించింది. సరైన అధ్యయనం చేయకుండానే.. సచివాలయాన్ని... ఎర్రగడ్డలోని చెస్ట్ ఆసుపత్రికి తరలిస్తామని సీఎం ప్రకటించారు. అయితే అక్కడ హెరిటేజ్ భవంతులు ఉండటం, బహుళ అంతస్తులకు అనుమతులు రావడం కష్టం కావడంతో కేసీఆర్ కు యూటర్న్ తీసుకోక తప్పలేదు. వాస్తు పేరిట వందల కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తారా..? అని విపక్షాలు కూడా విరుచుకుపడ్డాయి.
తలనొప్పిగా రాజయ్య బర్తరఫ్ వ్యవహారం
తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య బర్తరఫ్ వ్యవహరం కూడా ప్రభుత్వానికి తలనొప్పులు తెచ్చిపెట్టింది. అవినీతి ఆరోపణలపై రాజయ్యను మంత్రివర్గం నుంచి తొలగించడాన్ని ప్రజాస్వామ్యవాదులు, దళిత నేతలు తప్పుబట్టారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలకు దిగారు. అలాగే మంత్రివర్గంలో మహిళలకు చోటు దక్కకపోవడం పట్ల... ఆయా వర్గాలు ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నాయి. ఇలాంటి మరెన్నో విమర్శలు ఎదురవుతున్నా... గులాబీ ప్రభుత్వం మాత్రం డోంట్ కేర్ అంటోంది.
మార్కు పాలన కోసం ఇంద్ర భవంతులు
ఇక తన మార్కు పాలనను నిరుపించుకునేందుకు కొత్త భవంతులు కట్టాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. రవీంద్ర భారతిని కూల్చి... ఆల్చిప్ప మోడల్‌లో కొత్త భవంతిని నిర్మించేందుకు రెడీ అయ్యింది. క్రీడా స్థలంగా ఉన్న ఎన్ టిఆర్ స్టేడియంలో... కళాభారతి పేరిట కళా ప్రాంగణాన్ని కట్టాలని డిసైడ్ అయింది. అంతేకాకుండా ఇందిరా పార్కులోని... 20 ఎకరాల్లో వినాయక్ సాగర్ కట్టాలని నిర్ణయించింది.
గోకుల్ ఫ్లాట్స్ కూల్చివేతలో హల్‌చల్
భాగ్యనగరంలో అక్రమార్కుల భరతం పట్టేందుకు కొత్తలోనే హడావిడి చేసింది తెలంగాణ ప్రభుత్వం. గోకుల్ ఫ్లాట్స్ కూల్చివేత విషయంలో స్పీడ్ పెంచింది. అయితే ఏమైందో..? తెలియదు కానీ ఆ తర్వాత చల్లపడింది. భూ కబ్జాదారులపై కొరడా ఝులిపించేందుకు... అసెంబ్లీ వేదికగా సభా సంఘాన్ని వేసింది. నిజాలు నిగ్గుతేలక ముందే ప్రభుత్వమే ముందుకొచ్చి భూముల క్రమబద్దీకరణ చేపట్టింది.
దైవభక్తితో ప్రభుత్వంపై అదనపు భారం
ఇక కేసీఆర్ దైవ భక్తి వల్ల ప్రభుత్వంపై అదనపు భారం పడుతోంది. యాదగిరిగుట్టను యాదాద్రిగా మార్చారు. దాని అభివృద్ధి కోసం 1000 కోట్లు కేటాయించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. యాదాద్రి డెవలప్‌మెంట్ అథారిటిని ఏర్పాటును కూడా ఏర్పాటు చేసింది తెలంగాణ సర్కార్. అదే సమయంలో తెలంగాణ వచ్చినందుకు.. తిరుపతి వెంకన్నకు, బెజవాడ దుర్గమ్మకు, ఓరుగల్లు భద్రకాళి అమ్మవార్లకు కోట్ల రుపాయలతో మొక్కులు చెల్లిస్తాన్నారు కేసీఆర్.
ఆపరేషన్ ఆకర్ష్ తో ఇతరపార్టీల లీడర్లకు గాలం
ఆపరేషన్ ఆకర్ష్ కింద ఇతర పార్టీ ఎమ్మెల్యేలను అధికార పార్టీలో చేర్చుకోవడం కూడా మేధావులకు, రాజకీయ వర్గాలకు రుచించడం లేదు. ఉద్యమ పార్టీ కూడా... ఫక్తూ రాజకీయ పార్టీల మారి... అనైతికతకు పాల్పడుతోందన్న విమర్శలు వస్తున్నాయి. పూర్తి మెజార్టీ ఉన్నా ప్రతిపక్షాలను దెబ్బకొట్టాలన్న ఏకైక లక్ష్యంతో కారు స్పీడ్ పెంచుతోంది.
పోరుబాట పడుతోన్న విద్యార్థిలోకం
ఓయూ భూములపై కేసీఆర్ వ్యాఖ్యలు కూడా దుమారం సృష్టిస్తున్నాయి. ఒకప్పుడు ప్రత్యేక ఉద్యమ సారథికి నీరాజనం పట్టిన విద్యార్థి లోకం పోరుబాట పడుతోంది. తెలంగాణలో సీఎం వర్సెస్ ఓయూ ఎపిసోడ్ కొనసాగుతోంది. ఉస్మానియా భూములపై అటు పాలకులకు, ఇటు విద్యార్థులకు మాటలయుద్ధం జరుగుతోంది. ఓయూ జోలికొస్తే సహించేది లేదని విద్యార్థులు హెచ్చరిస్తున్నారు.
సచివాలయంలో మీడియాపై ఆంక్షలు
తెలంగాణ సాధనలో జర్నలిస్టుల పాత్ర గణనీయమని కీర్తించిన కేసీఆర్... ముఖ్యమంత్రి అయ్యాకా మీడియాతో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. సచివాలయంలో పాత్రికేయులకు ఆంక్షలు విధించడం కూడా వివాదస్పదమైంది. పారదర్శక పాలన అందిస్తున్నానంటున్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఎందుకు ఫోర్త్ ఎస్టేట్‌ను దూరం పెడుతున్నారో..? అర్ధం కావడం లేదు.
-TSUTF RAMANNAPET
Saturday, 30 May 2015
టీఆర్ఎస్ ఏడాది పాలన
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment